హైదరాబాద్ : స్కైరూట్ ‘విక్రమ్-1’ మిషన్‌ను ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. భారతదేశ అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ టెస్ట్ ఫ్లైట్-1 (మిషన్ ఆగమన్) విజయం ఒక చారిత్రాత్మక మైలురాయి అని, ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణమైన క్షణమని ముఖ్యమంత్రి శనివారం పేర్కొన్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ లాంచ్ వెహికల్ ‘విక్రమ్-1’ విజయవంతమైన పరీక్షా ప్రయోగం (మిషన్ ఆగమన్) సందర్భంగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్కైరూట్ ఏరోస్పేస్‌కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్పేస్-టెక్ స్టార్టప్ సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని అభినందిస్తూ, ఇది దేశ అంతరిక్ష రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. అంతరిక్ష అన్వేషణలో దేశం పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాన్ని , ఆవిష్కరణా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు ఆయన స్కైరూట్ ఏరోస్పేస్ను ప్రశంసించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను స్కైరూట్ ఏరోస్పేస్ను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి, ‘మిషన్ ఆగమన్’ ప్రయోగ కార్యక్రమానికి ముందు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు ‘విక్రమ్-1’ ఫ్లైట్ హార్డ్‌వేర్ రవాణాను తానే స్వయంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఏరోస్పేస్ , అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగే దిశగా తెలంగాణ సాగిస్తున్న ప్రయాణంలో ఈ విజయవంతమైన పరీక్షా ప్రయోగం ఒక కీలక మైలురాయి అని ఆయన అన్నారు. ఏరోస్పేస్ ఆవిష్కరణలు, అధునాతన తయారీ , తదుపరి తరం అంతరిక్ష సాంకేతికతలకు భారతదేశంలోనే ప్రధాన కేంద్రంగా తెలంగాణ స్థానాన్ని ఈ విజయం మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.



















