విశాఖపట్నం : భారతదేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటైన ఏపీకి దాదాపు 1,053 కి.మీల సముద్ర తీరం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్ వేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు . గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించింది. ఈ విషయంలో దాదాపు 10 శాతం వృద్ధి నమోదైంది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో 4 నూతన పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పోర్టులు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ఏపీ, పొరుగు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు తోడ్పాటునందిస్తాయి. దుగరాజ పట్నంలో దాదాపు రూ.30వేల కోట్ల పెట్టుబడితో మేజర్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గత వారమే విశాఖపట్నంలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, నౌకల మరమ్మతులు వంటి రంగాలకు సంబంధించి దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ఐదు సముద్ర రంగ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పోర్టులను పరిశ్రమలతో, పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్.
సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ అనుసంధానం కూడా కీలకంగా మారుతోంది. ఈ మార్పునకు విశాఖపట్నం కీలక కేంద్రంగా నిలుస్తోంది. విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి ఏఐ హబ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు డేటా సెంటర్లు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ అనుసంధాన వ్యవస్థల ఏర్పాటుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. మూడు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు విశాఖపట్నంలో ల్యాండ్ కానున్నాయి. రుషికొండలో సిఫీ సంస్థ అభివృద్ధి చేస్తున్న విశాఖపట్నం తొలి ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ విశాఖపట్నం మీదుగా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో విశాఖపట్నం ప్రశాంతమైన, అపార అవకాశాలున్న సముద్రతీర నగరంగా తనకు గుర్తుండి పోయిందని చెప్పారు. విశాఖపట్నం అంతర్జాతీయ ఏఐ హబ్‌గా మారుతుందని తాను అప్పట్లో ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. నేడు ఆ అవకాశాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొస్తోంది సర్కార్.


















