హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
దశాబ్దాల కరెంట్ కష్టాల నుంచి తెలంగాణకు శాశ్వతంగా విముక్తి కల్పించాలని కేసీఆర్ నాడు చేసిన కృషి ఇవాళ మరో విజయాన్ని సాధించిందని అన్నారు. తెలంగాణలో వెలుగుల ప్రస్థానం సాగాలని ఆనాడు వేసిన పునాదితో నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని సూపర్ క్రిటికల్ నాలుగో యూనిట్ విజయవంతం కావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు కేటీఆర్.800 మెగావాట్ల కమర్షియల్ ఆపరేషన్‌లో యాదాద్రి నాలుగో యూనిట్ – సీఓడీ పూర్తి చేసుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు.
ఈ కీలక ముందడుగు వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 3200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రావడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు కేటీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వప్నాన్ని సాకారం చేసిన విద్యుత్ శాఖ ఇంజనీర్లతో పాటు భాగస్వాములైన ప్రతిఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఒకనాడు పాలననే చేతకాదని కామెంట్స్ చేసిన దద్దమ్మలకు ఆచరణలో చేసి చూపించిన అరుదైన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
