హైదరాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి, కార్డులు అందించ బోతున్నాం అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను గణనీయంగా విస్తరించడం జరిగిందన్నారు. గత సంవత్సరం 16 కొత్త డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మొత్తం సెంటర్ల సంఖ్య 102కు చేరిందన్నారు. ప్రతి రోగి 20 నుంచి 25 నిమిషాల్లో డయాలసిస్ కేంద్రానికి చేరుకునేలా లక్ష్యంగా పెట్టుకుని 416 బెడ్ల కెపాసిటీతో మరో 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.
ఇప్పటికే డయాలసిస్ సేవలు అందిస్తున్న 67 సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు అదనంగా 155 కొత్త డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు దామోదర రాజ నరసింహ.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు 16,500 మంది రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నాం అని చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,000 మంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6,500 మంది సేవలు పొందుతున్నారని వెల్లడించారు. ఈ సేవల కోసం ప్రతి సంవత్సరం సుమారు రూ. 220 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. అవయవ దానంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జీవనదాన్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు వేలాది అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయన్నారు. అందులో 2,700 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు.
