ప్రాణ‌హిత‌ నీటిని మళ్లించేందుకు కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలి

తెలంగాణ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

hellotelugu-MLCKavitha

హైద‌రాబాద్ : ప్రాణ‌హిత నీటిని మ‌ళ్లించేందుకు కాఫ‌ర్ డ్యామ్ ను నిర్మించాల‌ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. సోమ‌వ‌వారం పార్టీ నాయకులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేప‌ల్లి (లక్ష్మి) పంప్ హౌస్ వద్ద ప్రాణ‌హిత‌ నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు క‌విత‌. నవంబర్ నెలాఖరులోపు కాఫర్ డ్యామ్ నిర్మించక పోతే, క‌న్నేప‌ల్లి పంప్ హౌస్ వద్ద తాము నిర‌స‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. మేడిగడ్డను ఒక విపత్తుగా చిత్రీకరిస్తూ రైతుల ప్రయోజనాలకు హాని కలిగించ వ‌ద్ద‌ని కోరారు. తాము కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, పోరాడటమే కాకుండా పరిష్కార మార్గాలను కూడా సూచిస్తున్నామ‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాస్తవానికి, తెలంగాణలోని రెండు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణాల నీటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే క‌రువు ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాద‌న్నారు.

ఒకప్పుడు “మా నీళ్లు మాకే కావాలి” అని డిమాండ్ చేస్తూ తెలంగాణ కోసం ఉద్యమించాం అని అన్నారు క‌విత‌. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం మన నీటిని పూర్తిగా వినియోగించు కున్నామా? అంటే, లేదు అని సమాధానం వస్తుందన్నారు. సరైన సమయానికి వర్షాలు కురవడంతో, పెద్దగా ఇబ్బందులు లేకుండా కాలం గడిచి పోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నది ప్రాజెక్టులపై కొంత పని జరగడం వల్ల 4 నుండి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందింద‌ని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో ఎస్ఆర్ఎస్పీ (SRSP), కడెం, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు వంటి ప్రాజెక్టుల ద్వారా 37 లక్షల ఎకరాలకు నీరందించి, ఆ భూములను స్థిరీకరించే ప్రయత్నం జరిగిందని చెప్పారు. కేవలం ఈ స్థిరీకరణ పనుల కోసమే మొత్తం 1.80 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా సాగులోకి వచ్చిన భూమి కేవలం 1 లక్ష ఎకరాలు మాత్ర‌మేన‌ని మండిప‌డ్డారు. తాము ఈ విషయాన్ని ఎత్తిచూపితే, బీఆర్ఎస్ సోషల్ మీడియా మాపై దాడి చేస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌విత‌. కానీ వాస్తవాలు మారవు. నిజం ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు. 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఒక్క కొత్త ఎకరాకు కూడా నీరు అందలేదన్నారు.

Exit mobile version