అమరావతి : తుపాకీ కంటే కలం గొప్పదని, గన్ కంటే పుస్తకమే సమాజాన్ని మారుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. తెలుగు భాష, మహిళా గౌరవ పరిరక్షణ ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి బాధ్యత అని నొక్కి చెప్పారు. మహిళలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా విలువలు, గౌరవం నేర్పించే సమయం వచ్చిందన్నారు. ‘అమ్మ’ అనే ఒక్క పదంలోనే తెలుగు మమకారం, సంస్కృతి, ఆత్మీయత అంతా నిక్షిప్తమై ఉందని చెప్పారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా నిర్వహించిన 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు–2026లో మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, మహిళా సాధికారత, పుస్తక పఠనం, సామాజిక విలువలు, మహిళల గౌరవ పరిరక్షణ వంటి అంశాలపై మంత్రి మాట్లాడారు.
‘దివిసీమ గాంధీ’గా పేరుపొందిన మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. 1975లో హైదరాబాద్‌లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకు రావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకు రావడంలో ఆయన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మండలి కుటుంబం తెలుగు భాషా పరిరక్షణను వారసత్వంగా కొనసాగిస్తోందని పేర్కొంటూ మండలి బుద్ధప్రసాద్ ని అభినందించారు హొం శాఖ మంత్రి. 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డిప్యూటీ స్పీకర్‌గా ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని ఎన్నటికీ మరిచి పోలేనని, “ఆయన నాకు గురువులాంటి వారని, శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అని మంత్రి అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన యద్దనపూడి సులోచనారాణి పేరును సభా ప్రాంగణానికి పెట్టడం ఆమె సాహిత్య సేవలకు దక్కిన గొప్ప గౌరవమని మంత్రి పేర్కొన్నారు. అలాగే రంగనాయకమ్మ, ఓల్గా (పి. లలిత కుమారి), వాసిరెడ్డి సీతాదేవి, డి. కామేశ్వరి వంటి ప్రముఖ రచయిత్రుల సేవలను కొనియాడారు.
అదే సమయంలో మహిళా సాధికారత, ప్రజాజీవితం, సామాజిక చైతన్యానికి విశేష సేవలందించిన నన్నపనేని రాజకుమారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, “నాకు మాత్రమే కాదు… రాష్ట్ర మహిళలందరికీ ఆమె స్ఫూర్తిదాయక నాయకురాలు” అని పేర్కొన్నారు. జస్టిస్ జ్యోతిర్మయి సమాజం పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్న మంత్రి, ఈ కార్యక్రమంలో తనతో పాటు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

















