హైదరాబాద్ :: సంఘ సంస్కర్త, మహోన్నత సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు . శనివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే దంపతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని అన్నారు. మహిళా విద్యాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి అసాధారణమని కొనియాడారు. ఆనాటి పెత్తందారీ వ్యవస్థను ఎదిరించి బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేయడం గొప్ప సామాజిక విప్లవమని పేర్కొన్నారు.
సమానత్వ సమాజ స్థాపనే పూలే దంపతుల ప్రధాన ఆశయమని, వారి ఆలోచనలు, సిద్ధాంతాలను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా వారి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, దానం నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, విజయలక్ష్మి, ఇందిరా శోభన్, కేతూరి వెంకటేష్‌తో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సామాజిక సమానత్వం, మహిళా విద్య, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే దంపతులు చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు.



















