హైదరాబాద్ : హైదరాబాద్ సిలీ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నివారణ , సెల్‌ఫోన్ దొంగతనాలు అరికట్టడంపై వివిధ మత పెద్దలు, అహ్ల్-ఎ-హదీస్ నాయకులతో పోలీస్ కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి శుక్రవారం కోత్వాల్ హౌస్‌లో , ప్రతి మంగళవారం బషీర్‌బాగ్‌లో పౌరులకు అందుబాటులో ఉంటానని తెలిపారు పోలీస్ కమిషనర్ . హైదరాబాద్ నగరాన్ని మరింత ప్రశాంతమైన నగరంగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. తాజాగా పురానీ హవేలీలోని కోత్వాల్ హౌస్‌లో పాతబస్తీ (చార్మినార్ జోన్)కి చెందిన హిందూ, షియా, సున్నీ మత పెద్దలు , శాంతి కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు అదనపు సీపీ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, వైభవ్ గైక్వాడ్ , టీఎఫ్ డీసీపీ మహమ్మద్ మజీద్, చార్మినార్ జోన్ అదనపు డీసీపీ , ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.
సమావేశాన్ని ఉద్దేశించి సీపీ మాట్లాడారు. మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యుల చురుకైన మద్దతుతో పాత నగరంలో శాంతి, మత సామరస్యాన్ని బలోపేతం చేయాలని నొక్కి చెప్పారు. నేను శాంతి యాత్రికుడిని (అమన్ కా ముసాఫిర్), శాంతే నా ధ్యేయం” అని పేర్కొంటూ, నగరం అంతటా సామరస్యాన్ని కాపాడటానికి సమాజంలోని అన్ని వర్గాల వారు కలిసి పని చేయాలని మహేష్ భగవత్ పిలుపునిచ్చారు. నేటి యువత, పాఠశాల విద్యార్థులు మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) , సోషల్ మీడియా దుర్వినియోగానికి బలి అవుతున్నారని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి ‘నషా ముక్త్ భారత్’ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా మాదకద్రవ్యాల బెడదను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక ‘ఈగిల్ ఫోర్స్’ను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. మత పెద్దలు తమ ప్రసంగాలు (తఖ్రీర్), ప్రార్థనలు, సామూహిక సమావేశాల సమయంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాల గురించి యువత , తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1908, డయల్ 112, లేదా డయల్ 100 హెల్ప్‌లైన్ నంబర్లకు తెలియ జేయాలని పౌరులకు సూచించారు.
తొలిసారి మాదకద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడిన యువ నేరస్థుల భవిష్యత్తు నాశనం కాకుండా చూసేందుకు ఎన్డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 64ఎ కింద, అటువంటి యువతకు, వారి తల్లిదండ్రులకు 7 నుండి 8 రోజుల పాటు వ్యసన విముక్తి కౌన్సెలింగ్ అందిస్తారని చెప్పారు. ఆ తర్వాత చేసే రక్త పరీక్ష ఫలితాలు నెగటివ్‌గా వస్తే వారిపై ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు ఉంటుందని కమిషనర్ వివరించారు. రాత్రిపూట ఆలస్యంగా తిరిగే యువతకు కౌన్సెలింగ్ ఇచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘మిషన్ చబుత్రా’ను మరింత విస్తరిస్తామని కూడా ఆయన తెలిపారు.

















