న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన శాసనపరమైన మార్పులపై ఇవాళ చర్చించే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల స్థానాలను 50 శాతం పెంచాలని ఈ ప్రతిపాదన పేర్కొంటోంది. దీనివల్ల లోక్సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుండి 816కి పెరిగే అవకాశం ఉంది. 2029 సాధారణ ఎన్నికలకు ముందే ‘నారీ శక్తి వందన్ అధినియం, 2023’ను అమలు చేసేందుకు ఈ మార్పులు ఉద్దేశించ బడ్డాయి.
అంతే కాకుండా ఇలా సవరించిన సీట్ల కేటాయింపును 25 ఏళ్ల పాటు మార్చకుండా (స్తంభింప జేసి) ఉంచాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్సభ నవంబర్ 30న శనివారం తో పాటు రాజ్యసభ డిసెంబర్ 2న తిరిగి సమావేశం కానున్నాయి. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించడం , శాసనసభ స్థానాల పంపిణీని ఖరారు చేయడం వంటివి ఉంటాయి. అయితే, కేంద్ర మంత్రివర్గం తీసుకునే తుది నిర్ణయం, ప్రతిపాదిత చట్టంలోని ఖచ్చితమైన అంశాలు , దాని అమలు కాలక్రమం వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
















