బెంగళూరు : రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల నిర్వహణపై అలాగే పాఠ్యపుస్తకాల నుండి ఈ మైసూరు పాలకుడికి సంబంధించిన అంశాలను తొలగించే విషయంలో బీజేపీ తీసుకున్న వైఖరిని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రానికి టిప్పు సుల్తాన్ చేసిన సేవలను మీరు తుడిచిపెట్టలేరు. మీకు నచ్చినా నచ్చక పోయినా, చరిత్రను ఎవరూ చెరిపి వేయలేరని పేర్కొన్నారు. ‘తెహ్రిక్-ఎ-ఖుదాదాద్’ అనే సంస్థ ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు సమర్పించిన వినతిపత్రంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, పాఠ్య పుస్తకాల్లో ఆయనకు సంబంధించిన పాఠాలను తిరిగి చేర్చాలని ఆ సంస్థ కోరింది. దీనిపై స్పందించిన ఖర్గే బీజేపీ ముందుగా చరిత్రను సరిగ్గా తెలుసు కోవాలని సూచించారు.
టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూరు యుద్ధాల్లో పోరాడారని చెప్పారు ప్రియాంక్ ఖర్గే. ఆయనను చూసి బ్రిటిష్ వారు ఎంతో భయపడే వారని గుర్తు చేశారు. ఇవి చరిత్రలో నమోదైన వాస్తవాలని, వీటిని తాను గానీ బీజేపీ గానీ మార్చలేమని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్ర పోరాటం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, దండి యాత్ర లేదా సహాయ నిరాకరణ ఉద్యమం వంటి ఏ పోరాటాల్లోనూ ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదని, అలాగే ఏ ఒక్క రౌండ్ టేబుల్ సమావేశంలోనూ వారు భాగం కాలేదని ఖర్గే ఆరోపించారు. బి.ఎస్. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వయంగా ఒక పుస్తకంలో టిప్పు సుల్తాన్‌ను ప్రశంసించినప్పటికీ, అప్పట్లో బీజేపీ టిప్పు సుల్తాన్ జయంతిని వ్యతిరేకించిందని కూడా ఆయన గుర్తు చేశారు.
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మైనారిటీ సమస్యలను వాడుకుంటోందని హోం మంత్రి విమర్శించారు. ఓట్లు అవసరమైనప్పుడు మైనారిటీలకు మద్దతు ఇచ్చే బీజేపీ, మిగిలిన సమయాల్లో మాత్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. చారిత్రక కట్టడాలను ప్రస్తావిస్తూ, బెంగళూరులోని లాల్‌బాగ్‌ను హైదర్ అలీ అభివృద్ధి చేశారని, టిప్పు సుల్తాన్ దానిని మరింతగా పోషించారని ఖర్గే అన్నారు. నంది హిల్స్‌లోని కోటను కూడా ఉదహరిస్తూ అటువంటి చారిత్రక కృషిని బీజేపీ తుడిచివేయాలని భావిస్తోందా అని ఆయన ప్రశ్నించారు.


















