హైదరాబాద్ : మైనారిటీల అభ్యున్నతికి ,హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ఇందుకోసం అవసరమైన నిధులను కేటాయిస్తోందని చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి, అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం, పురోగతిపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి మైనారిటీల విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యా సంస్థల నిర్మాణం, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు , పాతబస్తీ అభివృద్ధి వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. మైనారిటీ వర్గాలకు విద్యా అవకాశాలను విస్తరించేందుకు ఉద్దేశించిన నిధుల విడుదలలో ఎటువంటి జాప్యం లేదా ఆంక్షలు ఉండవని ఆయన హామీ ఇచ్చారు.
నాంపల్లిలోని హజ్ హౌస్ పక్కన, గత కొన్ని ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనుల కోసం జీహెచ్ఎంసీ ఉపయోగించుకున్న వక్ఫ్ భూములకు సంబంధించి, వక్ఫ్ బోర్డుకు చెల్లించాల్సిన నిధులలోని రూ. 25 కోట్లను ఈ భవన నిర్మాణ పూర్తికి కేటాయించాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఈ సదుపాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ భవనంలో మైనారిటీ విద్యార్థుల కోసం ఒక స్టడీ సర్కిల్‌తో పాటు, మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎటువంటి జాప్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే పాఠశాలలు, స్టడీ సర్కిళ్లు , ఇతర విద్యా సంస్థలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మొఘల్‌పురా , బండ్లగూడ ప్రాంతాల్లో రెండు స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసేందుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ స్టడీ సర్కిళ్ల కోసం అవసరమైన భవనాలను సమకూర్చేందుకు సిద్ధమని రాష్ట్ర అసెంబ్లీలో ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. మైనారిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించేలా, విదేశీ స్కాలర్షిప్ పథకం పరిధిని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.


















