విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 13 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు–2026’ సందర్భంగా కార్టూన్ల పోటీ నిర్వహించనున్నారు. ‘మల్లెతీగ కార్టూన్ల పోటీ–2026’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనేందుకు కార్టూనిస్టుల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. సమకాలీన సామాజిక సమస్యలు, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి, మత్తు పానీయాలు, సెల్ఫోన్ దుర్వినియోగం తదితర అంశాలపై కార్టూన్లు పంపవచ్చు. తెలుగువారి జీవన సంస్కృతిని ప్రతిబింబించే వినూత్న కార్టూన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాపీ కార్టూన్లను అనుమతించరు. ఒక్కొక్కరు గరిష్ఠంగా నాలుగు కార్టూన్లు పంపవచ్చు. కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ కార్టూన్లను 300 డీపీఐ నాణ్యతతో స్కాన్ చేసి పంపాలి.
ఉత్తమ కార్టూన్లకు రూ.2,500 చొప్పున 8 బహుమతులు ఉంటాయి. కన్సొలేషన్ బహుమతులుగా రూ.750 చొప్పున 4 బహుమతులు అందజేస్తారు. ఎంపికైన కార్టూనిస్టులను డిసెంబర్ 12, 13 తేదీల్లో విజయవాడలో జరిగే జాతీయ సాంస్కృతిక ఉత్సవాల వేదికపై నగదు బహుమతులతో పాటు ఘనంగా సత్కరించనున్నారు. కార్టూన్లను వాట్సాప్ ద్వారా పంపితే పోటీకి అంగీకరించరు. ఈమెయిల్ లేదా పోస్టు, కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి. ఈమెయిల్: malleteega.sss@gmail.com , పోస్టు లేదా కొరియర్ ద్వారా ఈ కింది చిరునామా కార్టూన్ల పోటీ–2026, నవమల్లెతీగ, 26-16-4, శుభశ్రీ టవర్స్, టి.ఎఫ్.1, ఉయ్యూరు జమీందారు వీధి, గాంధీనగర్, విజయవాడ–520 003కు పంపించాలని కోరారు.
కార్టూన్లు నవంబర్ 23, 2026లోగా నిర్వాహకులకు చేరాలి. పోటీలో బహుమతి పొందని కార్టూన్లను ‘నవమల్లెతీగ’ మాసపత్రికలో లేదా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల ప్రత్యేక సంచికలో ప్రచురించే అవకాశం ఉంటుంది. ఇందుకు కార్టూనిస్టులు ముందుగానే తమ అంగీకారం తెలియజేయాలి. పంపిన కార్టూన్లను తిరిగి పంపడం సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేశారు.పోటీకి సంబంధించిన తుది నిర్ణయం నిర్వాహకులదేనని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి వాదోపవాదాలకు తావు లేదని తెలిపారు.మరిన్ని వివరాలకు 92464 15150 నంబరులో సంప్రదించాలని కోరారు.

















