హుస్నాబాద్ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్తీక మాసంలోనే ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా వాటిని వేగంగా పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో భీమదేవరపల్లి మండలంలోని కొట్టెకొండలో ఉన్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, పోట్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగిందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొట్టెకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 3.80 కోట్లు, హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 80 లక్షలు, పోట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 1.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనుల గురించి ఆరా తీశానని తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక నమ్మకాలకు అనుగుణంగా, మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఆలయ నిర్మాణాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖకు చెందిన ఆర్కిటెక్ట్, పండితులు , ఇతర నిపుణులతో నిర్మాణ ప్రణాళికలు, అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు చెప్పారు మంత్రి.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణ రావు, దేవాదాయ శాఖ ఆర్కిటెక్ట్ వల్లి నాయగం, దేవాదాయ శాఖ డి.ఇ.ఓ ఓం ప్రకాష్, ఇ.ఓ కిషన్ రావు, పండితులు వినయ్ శర్మ, సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.



















