హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చొరవతో హైదరాబాద్ లో చేపట్టిన సమ్మెను నీటి ట్యాంకర్ల యజమానులు విరమించారు. తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరణకు అంగీకరించారు. హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ తో వాటర్ ట్యాంకర్ల యజమానులు సమావేశమయ్యారు. వాటర్ ట్యాంకర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించారు. కమిషనర్ సూచనల మేరకు సమ్మె విరమణ చేయాలని నిర్ణయించారు. ఔటర్ రింగు రోడ్డు అవతల నుంచి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు యజమానులు అంగీకరించారు. దీంతో గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మె ముగిసింది. తక్షణమే నీటి ట్యాంకర్ల సరఫరాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు వాటర్ ట్యాంకర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రతినిధులు ఏవీ రంగనాథ్ తో చర్చించారు.
సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన అనంతరం ప్యూర్ ప్రాంతం నుంచే బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు సంఘం సభ్యులు అంగీకరించారు. ఇకపై తమ ట్యాంకర్ వ్యాపార కార్యకలాపాలన్నీ అర్బన్ ప్రాంతం నుంచే నిర్వహిస్తామని వాటర్ ట్యాంకర్ల యజమానులు తెలిపారు. హైదరాబాద్ నగరం అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం కావడంతో పాటు ఎల్‌నినో ప్రభావం, తగినంత వర్షపాతం లేకపోవడం వంటి కారణాలతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో నగరంలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాణిజ్య అవసరాల కోసం పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తోడటం వల్ల స్థానిక నివాసితుల గృహ అవసరాలకు వినియోగించే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్‌పేట, అశోక్‌నగర్ వంటి ప్రాంతాల్లో నీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ట్యాంకర్ల నిర్వాహకులు రవాణా దూరం, ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు ఆయా ప్రాంతాలకు సమీపంలోని బోర్ల నుంచి నీటిని సేకరిస్తున్నారు.
దీంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. సాధారణంగా గృహ అవసరాల కోసం వేసే బోర్లు 100 నుంచి 300 అడుగుల లోతు వరకు ఉంటుండగా, వాణిజ్య అవసరాల కోసం కొందరు 1,000 నుంచి 1,500 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ లోతులో బోర్లు వేసి, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లతో నీటిని తోడుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలపై మరింత ప్రభావం పడుతోందని యజమానులకు కమిషనర్ తెలిపారు. ఈ సమస్యపై పలు కాలనీల సంక్షేమ సంఘాలు, స్థానిక ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. తెల్లాపూర్ ప్రాంతంలో వాణిజ్య అవసరాల కోసం నీటిని తోడటాన్ని నిలిపి వేయాలని స్థానికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సూరారం, జీడిమెట్ల ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలోని బోర్లలో నీరు అడుగంటి పోతోందని హైడ్రా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, భూగర్భ జలాల శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టింది. చెరువుల నుంచి వాణిజ్య అవసరాల కోసం నీటిని తోడుతున్న బోర్లను గుర్తించి తొలగించే చర్యలు కూడా చేపట్టింది. నగరంలోని జనసాంద్రత అధికంగా ఉన్న, నీటి డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెద్ద ఎత్తున వాణిజ్య అవసరాలకు వినియోగించకుండా నియంత్రించేందుకు వాటర్ బోర్డు, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలతో కలిసి హైడ్రా సమన్వయంతో పని చేసిందని హైడ్రా కమిషనర్ చెప్పారు.

















