అమరావతి : మురసు తీవ్ర తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వెల్లడించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి , రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందుగానే వాటిని తొలగించాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్వర్క్ సేవల్లో అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెగిపడిన వైర్లను తాకకుండా దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రమాదకర పరిస్థితులు కనిపించినా, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులను ముందుగానే అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా తగిన హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు తమ పడవలు, వలలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని, అవసరమైన చోట్ల సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.

















