వాషింగ్టన్ : హెచ్-1బి హోల్డర్లను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనం కంటే అమెరికాకు తీవ్రమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది ఇండియాస్పోరా. భారతీయ హెచ్-1బి వీసా హోల్డర్లపై ఉక్కుపాదం మోపడం, వలస నిబంధనలను కఠినతరం చేయడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చని, కీలక రంగాలను దెబ్బ తీయవచ్చని , అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని బలహీన పరచవచ్చని హెచ్చరిస్తోంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో పెరుగుతున్న భారత్ వ్యతిరేక వాదనలు, ప్రతిపాదిత వలసల ఆంక్షలపై హెచ్చరిస్తూ హెచ్-1బి వీసా హోల్డర్లను లక్ష్యంగా చేసుకోవడం అమెరికాకు తీవ్రమైన ఆర్థిక నష్టాలను కలిగించవచ్చని లాభాపేక్షలేని సంస్థ ఇండియాస్పోరా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అక్టోబర్ 30న జారీ చేసిన ఒక ప్రకటనలో ఈ నిష్పక్షపాత బృందం ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత , విద్య వంటి రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ సంతతికి చెందిన నిపుణులను రాక్షసులుగా చిత్రీకరించడానికి జరుగుతున్న రాజకీయ ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
భారతదేశానికి చెందిన హెచ్-1బి కార్మికులు అమెరికాను ప్రపంచ ఆవిష్కరణల అగ్రగామిగా నిలపడంలో సహాయపడ్డారు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. వారిని తరిమి వేయడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల నుండి చిన్న పట్టణాల వరకు ఉన్న కమ్యూనిటీలపై చాలా తీవ్రమైన పరిణామాలు పడతాయి అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు. హై-టెక్, హెల్త్‌కేర్ యజమానులకు 1,00,000 డాలర్లకు పైగా పిటిషన్ ఫీజులు విధించడం, కెరీర్ ప్రారంభ దశలో ఉన్న గ్రాడ్యుయేట్లకు నష్టం కలిగించే విధంగా రాండమైజ్డ్ లాటరీ స్థానంలో వేతన-ఆధారిత విధానాన్ని ప్రవేశ పెట్టడం, ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ కార్మికులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయడం వంటి ప్రతిపాదిత నియంత్రణ చర్యలపై ఈ డయాస్పోరా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్-4 జీవిత భాగస్వామి వర్క్ పర్మిట్లను నిలిపి వేయడం, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ , స్టెమ్ పొడిగింపులపై 70,000 డాలర్ల వరకు ఫీజులు విధించే ప్రతిపాదనలను కూడా ఇది ఎత్తి చూపింది.

















