అమరావతి : అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన చేపట్టారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఎస్.రాయవరం మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వరహా నదిలోని పెనుగొల్లు గ్రోయిన్ను హోంమంత్రి పరిశీలించారు. అనంతరం రాయవరం నుంచి లింగరాజుపాలెం వెళ్లే బ్రిడ్జిని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, చేపట్టిన ముందస్తు చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాయవరంలో స్థానిక ప్రజలతో మాట్లాడిన మంత్రి అనిత, తుఫాన్ ప్రభావం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు.
తీర ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని కోరారు. తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచనలను తప్పనిసరిగా పాటించాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు బాధితులకు.

















