అమరావతి : అర్నబ్ తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేస్తూ మూడు రోజుల్లో ఏడు సమీక్షలు నిర్వహించి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించ గలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా తుఫాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించామని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల వరకు అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు పని చేశారని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు, షెల్టర్ క్యాంపులకు తరలించడంతో పాటు, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించామని చెప్పారు.
రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. పంట నష్టాన్ని మినహాయించి, ఇతర నష్టాలకు సంబంధించి అర్హులైన బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ అంశంపై వర్చువల్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తుఫాను వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి తుఫాను తీవ్రత, రాష్ట్రంపై దాని ప్రభావాన్ని వివరించినట్లు చెప్పారు. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, సమగ్ర నష్ట నివేదికను కూడా త్వరలోనే కేంద్రానికి పంపిస్తామని వెల్లడించారు.
తుఫాను ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయని, పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు కూలి పోయినట్లు తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ ఎల్లుండి సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని వెల్లడించారు సీఎం. రాష్ట్ర రహదారులు, రహదారుల పై రాకపోకలను పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహారం, ఔషధాలు అందించేందుకు డ్రోన్లను కూడా సిద్ధం చేశామని వివరించారు. గతంలో తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సి వచ్చేదని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తుఫాను ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో ముందుగానే గుర్తించి, అక్కడే అధికార యంత్రాంగాన్ని మోహరిస్తున్నామని వివరించారు.
















