విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి కొనసాగుతోంది. సోమవారం శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భవానీ దీక్షాధారుల రాకతో ఆలయ పరిసరాలు మరింత సందడిగా మారాయి. అమ్మ వారి నామస్మరణలు, భక్తుల జయ జయధ్వానాలతో కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహా నవమి పర్వదినాన శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగజ్జననిని కనులారా వీక్షించి, మొక్కులు చెల్లించు కునేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో పాటు దీక్షాధారులు భక్తిశ్రద్ధలతో అమ్మ వారిని దర్శించుకుని సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన క్యూల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సహాయం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సంబంధిత శాఖలు దృష్టి సారించాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసు యంత్రాంగం, నగరపాలక సంస్థ, వైద్య సిబ్బంది పరస్పర సమన్వయంతో సేవలు అందించేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అవసరమైన చోట స్వచ్ఛంద సేవకులు కూడా భక్తులకు సహకరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, దేవస్థానం, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల మధ్య సమన్వయం ఉత్సవాల నిర్వహణలో కీలకంగా నిలుస్తోంది. భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, దర్శన మార్గాల్లో క్రమబద్ధతను పాటించేలా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు అమ్మవారి దివ్యదర్శనం కోసం భక్తుల ఆరాటం.. మరోవైపు వారికి సౌకర్యవం తమైన దర్శనం కల్పించేందుకు వివిధ శాఖల సేవలు.. వెరసి ఇంద్రకీలాద్రిపై భక్తి, సేవాభావం వెల్లివిరుస్తున్నాయి. మహిషాసురమర్దిని రూపంలో జగన్మాతను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.



















