హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , ఎమ్మెల్సీ కోదండ రాం రెడ్డిని కోరారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ . అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను రాజకీయంగా బలోపేతం చేయడంలో టీజేఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా. 2027 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు యూనియన్ కోసం జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లా పడింది. ఇదిలా ఉండగా టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్ , మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల కోసం రాజకీయ సమన్వయం, పరస్పర సహకారం , అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ , టీజేఎస్ల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని గౌడ్ గుర్తు చేశారు. అప్పట్లో టీజేఎస్ అందించిన మద్దతు, కాంగ్రెస్ను రాజకీయంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ నాయకత్వం క్రియాశీల పాత్ర పోషించాలని, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలోనూ, ఇతర రాజకీయ సందర్భాల్లోనూ టీజేఎస్ నిరంతరం కాంగ్రెస్కు అండగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఎమ్మెల్సీగా నియమితులైన విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సమన్వయాన్ని కొనసాగించడం , రాజకీయ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరు పక్షాలు చర్చించాయి. రాబోయే ఎన్నికల్లో టీజేఎస్ తమ సహకారాన్ని కొనసాగిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


















