న్యూఢిల్లీ : టీఎంసీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. సుమారు రూ. 804 కోట్ల నిధులున్న స్తంభింప చేసిన బ్యాంకు ఖాతాలను నిర్వహించేందుకు దీదీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. డెబిట్ లావాదేవీలు నిలిపి వేయబడిన నాలుగు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని అత్యున్నత న్యాయస్థానం కలకత్తా హైకోర్టును కోరింది. కోట్ల నిధులు కలిగిన నాలుగు బ్యాంకు ఖాతాలను తాత్కాలికంగా నిర్వహించేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గానికి అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం నాడు జరిగిన విచారణలో, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ , జస్టిస్ పి.బి. వరాళేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు.
ఎన్నికల సంఘం పార్టీ గుర్తును స్తంభింప జేసిందని, అందువల్ల ఆ నిధులపై ఎవరికి హక్కు ఉందనే ప్రధాన అంశంపై ఇంకా న్యాయపరమైన నిర్ణయం వెలువడాల్సి ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. తాము ఈ వ్యవహారంలోని వాస్తవాంశాల జోలికి వెళ్లడం లేదు. ఆర్టికల్ 136 కింద మాకున్న అధికార పరిధిని వినియోగించు కోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇదే క్రమంలో విచారణను వేగవంతం చేయాలని హైకోర్టును కోరుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీ రోజువారీ ఖర్చులను నిర్వహించు కోవడానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను బలహీన పరిచేలా ఉంటుందని భావించి, సుమారు రూ. 804 కోట్ల నిధులున్న నాలుగు ఖాతాలను నిర్వహించేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గానికి తాత్కాలిక అనుమతినిచ్చే ఉత్తర్వులను జారీ చేయడానికి కలకత్తా హైకోర్టు ఆగస్టు 27న నిరాకరించింది.

















