హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వ విద్యాలయం లో జరిగిన విద్యార్థి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. యూనివర్శిటీ అధికారికంగా తన విద్యార్థి సంఘం ఎన్నికల (2026) ఫలితాలను ప్రకటించింది. ఏఐఎస్ఏ , ఏఎస్ఏ, డీఎస్ యు, ఎస్ ఎఫ్ ఐ , టీఎస్ఎఫ్ కూటమికి చెందిన దిల్షాదా రాయిహాన్ 221 ఓట్లతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. టీఎస్ఎఫ్ కు చెందిన కొర్ర నితిన్ చౌహాన్ మొత్తం 212 ఓట్లతో ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఏఎస్ఏకు చెందిన ప్రతీక్ 177 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
హెచ్ ఎస్ యు విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ – ఎస్ఎల్ వీడీ కూటమికి చెందిన నరేష్ పోడిశెట్టి 197 ఓట్లు సాధించి, అధ్యక్ష పదవి కోసం జరిగిన పోటీలో రాయిహాన్ చేతిలో ఓడిపోయారు. ఏఐఎస్ ఏ – ఏఎస్ఏ – డీఎస్ యు – ఎస్ ఎఫ్ ఎఫ్ – టీఎస్ఎఫ్ కూటమికి చెందిన జిస్తి సెస్ట్ విభాగం నుండి పీహెచ్ డీ బోర్డు సభ్యుని స్థానాన్ని గెలుచుకున్నారు . అదే కూటమికి చెందిన హషిత ( ఎస్ ఎఫ్ ఐ) స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (ఎస్ఎల్ఎస్) నుండి పీహెచ్ డి బోర్డు సభ్యుని స్థానాన్ని దక్కించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి అయిన బిజోయ్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుండి స్కూల్ బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు.
ఏబీవీపీ – ఎస్ఎల్ వీడీ కూటమికి చెందిన సాహిల్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుండి కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకున్నారు. అలాగే ఇదే కూటమికి చెందిన జియాషెరిన్ ఇంటిగ్రేటెడ్ స్థానాన్ని గెలుచుకున్నారు.
ఏఐఎస్ ఏ – ఏఎస్ఏ – డీఎస్ యు – ఎస్ ఎఫ్ ఎఫ్ – టీఎస్ఎఫ్ కూటమికి చెందిన జిస్తి శ్రేయంత్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ నుండి బోర్డు సభ్యుని స్థానాన్ని, అదే కూటమికి చెందిన శ్రీరామ్ సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ నుండి పీజీ బోర్డు సభ్యుని స్థానాన్ని గెలుచుకున్నారు.
ఈ ఎన్నికల్లో సుమారు 5,900 మంది విద్యార్థులు ఓటు హక్కును కలిగి ఉండగా, 13 స్కూళ్ల పరిధిలోని తొమ్మిది కేంద్ర పదవులు, 59 స్కూల్ బోర్డు కౌన్సిలర్ స్థానాలకు 220 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ , అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ . దళిత స్టూడెంట్స్ యూనియన్ , స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరమ్ కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. వీరి తరపున అధ్యక్ష అభ్యర్థిగా దిల్షాదా రాయిహన్‌ను బరిలోకి దింపారు.

















