న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అడ్డంకులు తొలగించాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతుల కోసం విజ్ఞప్తి చేశారు. తనతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు . మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల ద్వారా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ బ్యారేజీకి అవసరమైన అనుమతులు లభించేలా చూడాలని ముఖ్యమంత్రి పాటిల్‌ను అభ్యర్థించారు. ఈ సమావేశంలో కృష్ణా , గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన పెండింగ్ అంశాలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించారు. ప్రాణహిత నదిపై +152 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టం తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించేందుకు తెలంగాణ , మహారాష్ట్రల మధ్య ఒప్పంద ప్రక్రియను వేగవంతం చేయాలని జలశక్తి మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించడం వల్ల గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేయడం సాధ్యమవుతుందని, తద్వారా విద్యుత్ వినియోగం, నీటి సరఫరాకు అయ్యే ఖర్చులు తగ్గుతాయని రేవంత్ రెడ్డి పాటిల్‌కు వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పర్యావరణ అనుమతుల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ , డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ , సీతారామ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ , గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు.. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతులకు సంబంధించిన కొత్త మార్గదర్శకాల గురించి ఆయన పాటిల్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ ప్రాజెక్టులకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరారు.

















