అమరావతి : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది ఏపీ కూటమి సర్కార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆమోదంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి దుర్గేష్. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా, సీఆర్‌జెడ్ (CRZ) నిబంధనలకు లోబడి విశాఖలో గ్రామసభ నిర్వహించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్పియర్ కోర్ వంటి ప్రతిష్టాత్మక గ్రూప్ హోటల్స్ ముందుకు వచ్చాయని, పెట్టుబడిదారుల ఆసక్తి మేరకు తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత పాలకులు రుషికొండ ప్యాలెస్‌ను ఇష్టారీతిన నిర్మించారని, వ్యక్తిగత వినియోగం కోసం అత్యంత విలాసవంతంగా నిర్మించారని విమర్శించారు. వీలైనంత త్వరగా రుషికొండ ప్యాలెస్‌లు వినియోగానికి తెస్తామని స్పష్టం చేశారు..
రుషికొండ ప్యాలెస్ ను ఆతిథ్యరంగానికి వినియోగించేలా చర్యలు చేపడతామన్నారు. గతంలో రుషికొండ రిసార్టు ద్వారా ఏటా రూ.15 కోట్లు ఆదాయం వచ్చేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పర్యాటకశాఖ ఆదాయం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు..రుషికొండపై ఉన్న 9 ఎకరాల్లో 7.5 ఎకరాలు సీఆర్‌జెడ్‌లో ఉండగా, కేవలం 1.5 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు..
2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, అద్భుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుతెలిపారు.పుష్కరాలకు కర్టెన్ రైజర్‌గా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘ది గోదావరి కాల్స్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాళ్లబండి సుబ్బారావు, రాజరాజ నరేంద్రుడు, ఆదికవి నన్నయ్య తదితరుల స్మరణతో తెలుగు కళా వైవిధ్యాన్ని ప్రదర్శించబోతున్నట్లు చెప్పారు. బ్రిడ్జిలంకలో టెంట్ సిటీలు, వాటర్ ఫ్రంట్ గేమ్స్, మరియు పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


















