తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 16న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్టు నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ను భక్తులకు త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు ఏఈవో వెంకయ్య చౌదరి. డిజిటల్ కంటెంట్‌తో పాటు తిరుమల ఆలయ చరిత్ర, వారసత్వం, పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులను సమగ్రంగా ప్రదర్శించే విధంగా మ్యూజియంను ఆధునీకరించినట్లు చెప్పారు. దాదాపు 14 గ్యాలరీల్లో ప్రత్యేకమైన థీమ్‌తో మ్యూజియాన్ని తీర్చిదిద్దామని, ఆలయ సంప్రదాయం, వారసత్వానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు.
మ్యూజియం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక మాన్యువల్‌ను రూపొందిస్తున్నామని అన్నారు. ఇందులో సీసీ కెమెరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, గైడ్ల సేవలు, భద్రతా చర్యలు, కళాఖండాల ప్రత్యేక నంబరింగ్ తదితర అంశాలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. మ్యూజియంను ఎస్ఓపీ ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. తిరుమలలో భక్తులకు దర్శనంతో పాటు ఇతర ఆధ్యాత్మిక, జ్ఞానదాయక అనుభూతులను అందించడమే టీటీడీ లక్ష్యమని అదనపు ఈవో తెలిపారు. భక్తులు తమ నిరీక్షణ సమయంలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్, మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శించి తిరుమల చరిత్ర, ఆలయ విశిష్టత, స్వామివారి సేవలు, సంప్రదాయాలు తదితర అంశాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తే వారి తిరుమల యాత్ర మరింత పరిపూర్ణంగా మారుతుందని చెప్పారు.
తిరుమలను మరింత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇటువంటి ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్, ఎస్వీ మ్యూజియంలను పరిశీలించిన మీడియా ప్రతినిధుల నుంచి పలు విలువైన సూచనలు అందాయని అదనపు ఈవో తెలిపారు. ముఖ్యంగా తెలుగు కంటెంట్‌ను మరింతగా పెంచడం, కంటెంట్‌ను క్రమం తప్పకుండా మార్చడం, విభిన్న అంశాలను అందించడం తదితర సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మీడియా ప్రతినిధులు ఇచ్చిన సంబంధిత సూచనలను అంతర్గతంగా చర్చించి, ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో కంటెంట్ , నిర్వహణ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.



















