గురుగ్రామ్ : క్రీడలు లేనిదే వికసిత భారత్ లేదన్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్
క్రీడలలో నాలుగు దశాబ్దాల అనుభవాన్ని ఉపయోగించుకుంటూ చదవడం , సంఖ్యా శాస్త్రంతో పాటు శారీరక అక్షరాస్యత కూడా ఒక జాతీయ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. వికసిత భారత్ సాకారం కావాలంటే, క్రీడలే అన్నింటికన్నా ముఖ్యమైనవి కావచ్చు. క్రీడలు లేని విద్య అసంపూర్ణం అని భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పేర్కొన్నారు. పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘బ్రాండ్ ఇండియా రెప్యుటేషన్ సమ్మిట్ అండ్ స్టోరీ కన్వెన్షన్ మూడవ ఎడిషన్‌ను నిర్వహించింది. ఉత్ప్రేరకాలు, ఆచరణవాదులు , మార్గదర్శకులుగా వర్గీకరించబడిన 15 మంది ప్రఖ్యాత వక్తల మధ్య గోపీచంద్ ఒక మార్గదర్శక వక్తగా పాల్గొన్నారు. ప్రముఖ క్రీడా పాత్రికేయురాలు శారదా ఉగ్రాతో భారతదేశాన్ని బెంచ్‌పై ఉంచే సాఫ్ట్ పవర్ అనే అంశంపై ఫైర్‌సైడ్ డైలాగ్‌లో పాల్గొన్నారు.
క్రీడల గురించి ఆలోచించడానికి భారతదేశ వ్యాపార నాయకులకు ఒక సరికొత్త దృక్పథాన్ని అందిస్తూ క్రీడలలో భారతదేశ ఖ్యాతి పతకాల కంటే దేశంలోని ప్రతి బిడ్డకు ఆడే అవకాశం ఉందా లేదా అనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని అన్నారు గోపీచంద్. మన పిల్లల కంటే మన తల్లిదండ్రులు, తాతా మామ్మలు ఎక్కువ ఫిట్‌గా ఉన్నారు, వారికి కదలికల పరిజ్ఞానం కూడా ఎక్కువగా ఉందన్నారు. ప్రతి బిడ్డ తమ పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా పరుగెత్తడానికి, విసరడానికి, ఆడుకోవడానికి సహాయ పడాలన్నారు. పెరుగుతున్న పతకాల సంఖ్య స్వాగతించ దగినదే, అయినప్పటికీ పిరమిడ్ అట్టడుగున ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లోతైన కొలమానం. ఎందుకంటే, కేవలం ఉన్నత స్థాయి ప్రదర్శన మాత్రమే మొత్తం జనాభా ఫిట్నెస్ను పెంచదని అన్నారు.
క్రీడల విలువ ఏమిటంటే అది ఒక బిడ్డను ఆడుకోవడానికి, అందరి ముందు ఓడిపోవడానికి , చిన్న వయసులోనే స్థైర్యాన్ని నేర్చుకోవడానికి అనుమతిస్తుంది. తద్వారా జీవితంలో తర్వాత ఎదురయ్యే బహిరంగ ఎదురు దెబ్బలను ఎదుర్కోవడం సులభం అవుతుందని పేర్కొన్నారు.



















