న్యూఢిల్లీ : ఢిల్లీలో పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నియంత్రణకు విధానం తీసుకు వస్తామని త్వరలోనే ఓ పోర్టల్ ను రూపొందిస్తామని ప్రకటించారు విద్యా శాఖ మంత్రి ఆశిష్ సూద్. వసతి గృహాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలు, సౌకర్యాలు, అద్దెలు , ఒప్పందాలను నియంత్రించేలా ఈ విధానం ఉంటుందని ఆయన తెలిపారు. గౌబా కమిటీ నివేదిక అమలును వేగవంతం చేస్తామని , పేయింగ్ గెస్ట్ వసతి గృహాలు, వాటి సౌకర్యాలు , భద్రతా నిబంధనలను నమోదు చేయడానికి ఒక ఉమ్మడి పోర్టల్‌ను ప్రారంభిస్తామని ఆశిష్ సూద్ పేర్కొన్నారు. నగరంలోని పీజీ వసతి గృహాలు, కోచింగ్ సంస్థలను నియంత్రించడానికి సమగ్ర విధానం అవసరమని అన్నారు. వెబ్ పోర్టల్‌ను తీసుకు రానున్నట్లు ఆయన వెల్లడించారు. సత్య నికేతన్‌లో భవనం కూలిపోయి ఏడుగురు మరణించి, పలువురు గాయపడిన ఘటన జరిగిన కొద్ది రోజులకే, పీజీ వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థుల సమస్యలను తెలుసు కోవడానికి వారితో సమావేశం అయ్యారు.
అనంతరం సూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము దీనిపై ఇప్పటికే పని చేస్తున్నాం. కానీ ఈ విషాదకరమైన సంఘటన గౌబా కమిటీ నివేదిక అమలును వేగవంతం చేయడానికి , ఒక విధానాన్ని రూపొందించడానికి మమ్మల్ని ప్రేరేపించింది అని సూద్ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ , గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ పరిధిలోని వృత్తిపరమైన కళాశాలల విద్యార్థులను, పీజీ వసతి గృహాల వినియోగదారులుగా వారి సమస్యలను పంచుకోవడానికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. అద్దె, పీజీ నిర్వాహకులు కల్పించే సౌకర్యాలు, ఒప్పందాల అమలు , భద్రతకు సంబంధించిన అంశాలను విద్యార్థులు లేవనెత్తారని ఆయన చెప్పారు. పీజీ వసతి గృహాల వివరాలు (అందుబాటులో ఉన్న గదులు, సౌకర్యాలు , భద్రతా ప్రమాణాలతో సహా) ఒక ఉమ్మడి పోర్టల్‌లో నమోదు చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సూద్ తెలిపారు.
పీజీ భవనం ఒకరిది కావచ్చు, నిర్వహణ మరొకరు చేయవచ్చు . డబ్బును వేరొకరు వసూలు చేయవచ్చు. ఒప్పందాల అమలు , విద్యార్థులకు వాగ్దానం చేసిన సౌకర్యాలు కల్పించడం అనేది ప్రధాన ఆందోళన అని ఆయన అన్నారు. విధానాన్ని ఖరారు చేసే ముందు పేయింగ్ గెస్ట్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఏజెన్సీలు, విద్యార్థి సంఘాలు , నీరు, విద్యుత్ శాఖలతో సహా ఇతర సంబంధిత వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా , లెఫ్టినెంట్ గవర్నర్‌తో చర్చించిన తర్వాత, దానిని మంత్రివర్గం ముందు ఉంచుతామని ఆయన చెప్పారు.
















