అమరావతి : ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని, ప్రతి కుటుంబానికి అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కేవలం రెండేళ్లలో 90 శాతం అమలు చేశామని, మాటల్లో కాకుండా గణాంకాల్లో కూడా చూపిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రైతు, మహిళ, విద్యార్థి, బీసీ, మత్స్యకారుడు, చేనేత కార్మికుడు, దివ్యాంగుడు.. ఇలా ప్రతి వర్గానికీ అండగా నిలుస్తున్నామన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం లీడర్ షిప్ కాంక్లేవ్ లో ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలిస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు ఖర్చు చేసి, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా నిలిచామని తెలిపారు. 24 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని, దీనిలో భాగంగా రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని చెప్పారు.
పేదలందరికీ విద్య హక్కు కల్పించడంలో భాగంగా తల్లికి వందనం పథకంలో భాగంగా ఏటా 67.27 లక్షల మంది విద్యార్థులకు ఏటా రూ.15వేల చొప్పున అందిస్తున్నామన్నారు ఎస్. సవిత. ఇందుకోసం రెండేళ్లలో రూ.20,090 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పెనుకొండ నియోజకవర్గంలోనే తల్లికి వందనం కింద 32,969 మంది విద్యార్థులకు రూ.49.45 కోట్లు అందించామని, ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని మంత్రి సవిత తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికీ ఏటా రూ.20 వేలు అందిస్తున్నామన్నారు. రెండేళ్లలో 46 లక్షల మంది రైతులకు రూ.14,664 కోట్లు పెట్టుబడి సాయంగా అందించామన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ లక్ష్యమన్నారు. 31.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,100 కోట్లు రైతులకు చెల్లించామన్నారు.
మహిళల ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టామని, ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఇందుకోసం రూ.3,218 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మహిళల వంటింటి భారం తగ్గించేందుకు దీపం-2 పథకంలో 4.57 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. గ్యాస్ సబ్సిడీ కోసం రూ.3,800 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పెనుకొండలో దీపం-2 పథకం కింద 5.74 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు ఎస్. సవిత. ఇందుకోసం రూ.49.25 కోట్ల సబ్సిడీని అందజేశామని తెలిపారు.
















