చెన్నై : తలైవా రజనీకాంత్ నటిస్తున్న సీక్వెల్ మూవీ జైలర్ -2. అందరి కళ్లు దీని మీదే ఉన్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో తనే నటించిన జైలర్ రికార్డులను తిరగ రాసింది. రజనీకాంత్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. దీంతో దర్శక నిర్మాతలు సీక్వెల్ కు ప్లాన్ చేశారు. ఇది కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 15న ‘జైలర్ 2’ విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి రీషూట్లు ఉంటాయని కొన్ని పుకార్లు షికారు చేసినప్పటికీ, అవన్నీ అవాస్తవమని తేలింది.
సోషల్ మీడియా సమాచారం ప్రకారం సినిమా యొక్క ‘అన్ట్రిమ్డ్ కట్’ (ఎడిటింగ్ పూర్తికాని ముడి వెర్షన్) ఇప్పటికే ఖరారైంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నేపథ్య సంగీతం పనులు ప్రారంభించడానికి సంగీత దర్శకుడు అనిరుధ్ కోసం చిత్ర బృందం వేచి చూస్తోంది. ఈ చిత్రం అనుకున్న తేదీకే థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జైలర్ 2’, 2023లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘జైలర్’కు సీక్వెల్. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. శివరాజ్ కుమార్, రమ్య కృష్ణన్, మిర్నా, వినాయకన్ , యోగి బాబు తమ పాత పాత్రలను తిరిగి పోషించనుండగా, విద్యాబాలన్, సూరజ్ వెంజరమూడు, జతిన్ సర్నా , మిథున్ చక్రవర్తి వంటి నటులు కొత్తగా ఈ చిత్రంలో భాగం కానున్నారు.

















