విశాఖపట్నం జిల్లా : రాజకీయ విలువలకు, నిజాయతీకి నిలువెత్తు ప్రతిరూపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలోని సిరిపురం సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రోశయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్యులు మా ఆత్మ గౌరవాన్ని గౌరవించాలని కోరారు. అందుకే తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో రికార్డు సమయంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. అది ఒక చరిత్ర. భూమి మేం ఇచ్చాం. నిధులు ఆర్యవైశ్య సోదరులే సమకూర్చి ఏర్పాటు చేశారు. మీరు కోరుకుంటే ఐక్యతతో నిలబడతారనే దానికి ఇది నిదర్శనం. ఇప్పుడు విశాఖపట్నంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు.
పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య పెద్దల ఆమోదంతో ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’ అని పేరు పెట్టుకున్నాం. అదే విధంగా రోశయ్య విగ్రహాన్ని చూసిన వెంటనే గుర్తొచ్చే పదం ‘స్టేట్స్‌మన్’. అందుకే ఈ విగ్రహాన్ని ‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్‌మన్’ అని పిలుద్దాం” అని ప్రతిపాదించారు. రాజకీయ విలువల గురించి మాట్లాడాలంటే గుర్తొచ్చే పేర్లలో రోశయ్య ఒకరు. నాకు ఎంతో ఇష్టమైన నాయకుడు, గొప్ప స్టేట్స్‌మన్ రోశయ్య. క్రమశిక్షణ, నిజాయతీ, సబ్జెక్టుపై పట్టు, మాటల్లో మంచితనం, విమర్శల్లో పదును ఆయన ప్రత్యేకతలు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసిన సేవే శాశ్వతం అని నమ్మిన వ్యక్తి రోశయ్య . అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోశయ్య మాట్లాడుతుంటే అందరూ సైలెంట్‌గా వినేవారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య ఒక వారధిగా ఉండేవారు. చంద్రబాబు , వైఎస్సార్ మధ్య ఎప్పుడైనా వాడివేడిగా వాదన జరిగినప్పుడు రోశయ్య నిలబడి కాస్త చల్లబరిచేవారు. మరుసటి రోజు బాబుకి ఫోన్ చేసి ‘చాలా చక్కగా వాదనలు జరిగాయి.. ఇవాళ చర్చ కొనసాగిద్దాం’ అని చెప్పేవారు. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత గౌరవాన్ని కాపాడిన నాయకుడు రోశయ్య అని అన్నారు.















