లండన్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలను భారీ స్థాయిలో విస్తరించేందుకు పలు విశ్వ విద్యాలయాలను సందర్శించారు. 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సీఎం బృందం సందర్శించింది. తెలంగాణ, ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయాల మధ్య భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనా అవకాశాలు కల్పించడంపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చలు జరిగాయి. విశ్వ విద్యాలయంలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బాలియోల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు ‘తెలంగాణ రైజింగ్’ దార్శనికత గురించి వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయం తన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రత్యేక పరిశోధనా సామర్థ్యాలు, విస్తృత విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకు రావాలనిఆహ్వానించారు. తెలంగాణ యువతకు, ఉద్యోగస్తులకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనా అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా, విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాలలో తెలంగాణ ప్రభుత్వంతో పలు భాగస్వామ్య అవకాశాలను వారు ప్రతిపాదించారు.ప్రస్తుత ప్రీమియర్ లీగ్ ఛాంపియన్లైన ఆర్సెనల్ , కోవెంట్రీ మధ్య జరిగే ఈపీఎల్ మ్యాచ్‌ను వీక్షించారు సీఎం.

















