అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు నడిపిస్తోంది. ఇందులో భాగంగా జూలై 24వ తేదీన రెండో విడత తల్లికి వందనం నిధులు జమ చేయబోతున్నట్లు వెల్లడించింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నాం అని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. దీపం-2 పథకంలో ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు, స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు, చేనేతలకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాం అన్నారు.
ఎన్నికల్లో హామీ ఇవ్వని అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం అన్నారు. ఇచ్చిన హామీ మేరకు 16వేల టీచర్ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం అని తెలిపారు. 10వేల పోస్టులతో జాబ్ క్యాలండర్ ప్రకటించాం. ఒకవైపు గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరోవైపు సంక్షేమాన్ని పద్ధతి ప్రకారం కొనసాగిస్తున్నాం. వైసిపి హయాంలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వంలో ట్రూడౌన్ చేసి తగ్గించాం, చెత్తపై పన్ను వంటి వాటిని తొలగించాం. 60 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయిలో అందజేస్తున్నాం అని తెలిపారు సీఎం. మరో ఏడాది కష్టపడితే ఆర్థిక సమస్యలను అధిగమిస్తాం. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం నింపాల్సిన బాధ్యత పార్టీ కేడర్ పై ఉందన్నారు.

















