హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన జన, కుల గణనలో పెద్ద ఎత్తున బీసీలకు మోసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జనగణనలో కులగణన మళ్లీ మోసపోతున్న బీసీలు అనే అంశంపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా జనగణన మొదటి దశ (Phase-I)లో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ పూర్తయిందని అన్నారు. ప్రస్తుతం రెండో దశ (Phase-II) జనాభా గణనకు సంబంధించిన ప్రశ్నావళిపై 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జూలై 6 నుంచి జూలై 18 వరకు ప్రీ-టెస్టింగ్ జరుగుతోందని తెలిపారు.
ఈ ప్రీ-టెస్టింగ్ ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీలకు ముందుగానే కేటాయించిన యూనిక్ కోడ్ల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ, మిగతా కులాల విషయంలో “ఓపెన్-ఎండెడ్” విధానాన్ని అనుసరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఏ పేరుతో తమ కులాన్ని చెబితే అదే నమోదు చేయడం వల్ల ఒకే కులం వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో నమోదై డూప్లికేషన్, మల్టిప్లికేషన్ ఏర్పడి, కులగణన విశ్వసనీయత దెబ్బతింటుందని చెప్పారు.
2011లో నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల గణన (SECC)లో యూనిక్ కోడ్లు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 42 లక్షల కులాల పేర్లు నమోదయ్యాయని, 2014 తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఇదే సమస్య తలెత్తిందని గుర్తు చేశారు. అయితే 2024 తెలంగాణ సామాజిక, విద్యా, ఉపాధి, రాజకీయ ,కుల సర్వేలో ప్రతి కులానికి కోడ్ నంబర్లు కేటాయించడం వల్ల కులాల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేయడం సాధ్యమైందని పేర్కొన్నారు. బీహార్ కులగణనలో కూడా కోడ్ వ్యవస్థను అమలు చేశారని తెలిపారు.
కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించి, అదే ఆధారంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కులగణన కూడా 2011 తరహాలో ప్రయోజనం లేకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే జనగణనలో ఉన్న 29 ప్రశ్నల షెడ్యూల్ను యథాతథంగా కొనసాగించకుండా సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులను సమగ్రంగా ప్రతిబింబించేలా కొత్త ప్రశ్నలను చేర్చి షెడ్యూల్ను సవరించాలని కోరారు. తుది ప్రశ్నావళిని ఖరారు చేసే ముందు ప్రజా సంఘాలు, నిపుణులు, బీసీ సంస్థలతో విస్తృత ప్రజా సంప్రదింపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

















