అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జనం నమ్మే స్థితిలో లేరన్నారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సుంధ్్యారాణి. ఆదివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని ప్లాన్ చేశాడన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఘనుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త రాజకీయానికి తెర లేపాడన్నారు. గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ మాటలు నిలకడలేనివంటూ కొట్టి పారేవారు. తల్లి, చెల్లిని గెంటేసి చిన్నాన్న హత్య నిందితులపై చర్య తీసుకోని వాడిని మనుషుల జాబితా లో చేర్చలేం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కంటే సీనియర్ నేతలు ఉత్తరాంధ్ర నుంచి బొత్స, ధర్మాన లాంటి వారు గొడ్డలి పార్టీ లో ఉన్నా…, నిలకడలేని మాటల వల్లే జరిగే నష్టం ఎందుకు చెప్పలేక పోతున్నారో? అని నిలదీశారు. విశాఖ రాజధాని అని ఎన్నికలకు వెళ్తే ఆ చుట్టు పక్కల ఎవ్వరూ ఓటేయక పోవటంతో జగన్ మాటలు ప్రజలు నమ్మడం లేదని స్పష్టమవుతోందని అన్నారు గుమ్మడి సంధ్యారాణి. తన పేరులో గన్ ఉన్నట్టే రాజధాని పేరులోనూ గన్ లు, గొడ్డళ్లు ఉండాలని అనుకుంటున్నాడని అది చెల్లదన్నారు. మానవ సంబంధాలతో పనిలేదు నిలకడలేని మనిషి నిలకడలేని మనస్తత్వం తో మాట్లాడే వాటిని పిచ్చెక్కిన మాటలంటారని అన్నారు. జగన్ తాను పిచ్చోడినని చెప్పుకుంటున్నాడా లేక ప్రజల్ని పిచ్చోళ్లని చేద్దాం అనుకుంటున్నాడా ? అని ఎద్దేవా చేశారు.
















