హైదరాబాద్: కోటి మొక్కల రామయ్యగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను చిరస్థాయిగా నిలబెట్టే ఉద్దేశంతో రూపొందిన లఘుచిత్రం ‘వనజీవి రామయ్య’ మూవీ టీమ్ సమక్షంలో, వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెప్రకృతి వానలకు వనజీవి రామయ్య పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా రూపోందిస్తున్నామని నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి వాస్విక్ గ్రూప్ చైర్మన్, సినీ నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి, వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మెన్ నూకల భాస్కర్ రెడ్డి, దర్శకుడు వేముగంటి నాయకత్వం వహించారు. కార్యక్రమంలో మొక్కల వెంకటయ్యను ప్రత్యేకంగా సన్మానించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురు సేవాభావం కలిగిన వ్యక్తులకు వనజీవి అవార్డులను అందజేశారు. సమాజానికి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించిన మహనీయుడు దరిపల్లి రామయ్య జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే ‘గద్దర్ అవార్డ్స్’లో ఉత్తమ లఘుచిత్రాల విభాగానికి ఎంపిక కావడం విశేషం. ఈ చిత్రంలో బ్రహ్మాజీ టైటిల్ పాత్రలో నటించగా, నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, నిర్మాతగా వ్యవహరించారు. డా. కళా రంగా కథను అందించగా, బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని సమకూర్చారు.
ఈ సందర్భంగా మొక్కల సత్యనారాయణ, మొక్కల వెంకటయ్య మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెట్లు మనిషి జీవితానికి ప్రాణాధారం అని, ప్రతి కుటుంబం కనీసం కొన్ని మొక్కలైనా నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. వనజీవి రామయ్య చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.


















