అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. జగన్ నోటా శాంతిభద్రతలు మాట రావడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ప్రతిపక్షాల పైనా, ప్రజలపైనా అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాతే ప్రజలు ఊపిరిపీల్చుకున్నారని అన్నారు. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే, ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయట తిరగలేరన్నారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యవాది అని, అందుకు తామంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైతుల గురించి జగన్ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్.. ఏరోజు కూడా రైతులను, వ్యవసాయ రంగాన్ని పట్టించకున్న పాపాన పోలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయాల్లోనే రైతులకు మేలు జరిగేదాని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని మంత్రి సవిత తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపైనా, సంక్షేమ కార్యక్రమాల అమలుపైనా చర్చకు రమ్మంటే జగన్ రెడ్డి ముఖం చాటేస్తున్నారని, కూటమి ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే వ్యవహరిస్తే…రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటులో ప్రజలు గెలవనివ్వరని మంత్రి సవిత హెచ్చరించారు. జగన్ రెడ్డికి మహిళలంటే చిన్నచూపు అని, అందుకే వారిని అవమానిస్తుంటారని మండిపడ్డారు. ఇంట్లో తల్లిని, చెల్లిని గౌరవిమవ్వని జగన్ రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నాడని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు జగన్ పైశాచిక ఆనందాన్ని పొందారన్నారు. అమరావతి ప్రాంత మహిళలను, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని తీవ్రంగా అవమానించారన్నారు. హోంమంత్రి అనితపై వైసీపీ నాయకుడు అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. హోంమంత్రి కట్టుబొట్టునుద్దేశించి అమర్నాథ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

















