తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులను నిర్వహించాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి స్పష్టం చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 9 జిల్లాల నుంచి వినియోగదారులు మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు, పాడైపోయిన విద్యుత్ స్తంభాల మార్పు, వేలాడే విద్యుత్ తీగలను సరి చేయడం, లో వోల్టేజ్ తదితర సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎండి శివశంకర్ లోతేటి మాట్లాడారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.
సంస్థలో అవినీతిపై ఫిర్యాదులు అందితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ పరిధిలో గృహ, వాణిజ్య విద్యుత్ సర్వీసుల మంజూరులో జాప్యం, విద్యుత్ సమస్యలను నిర్దిష్ట కాల పరిమితిలోగా పరిష్కరించనట్లయితే సంబంధిత అధికారులు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అన్నారు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు సీఎండీ. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం, ఏపీఎస్పీడీసీఎల్ చాట్ బోట్ ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించు కోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ (టెక్నికల్ , హెచ్ఆర్ డి) కే. గురవయ్య, డైరెక్టర్/ఫైనాన్స్ (ఎఫ్ఏసి) కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆదిశేషయ్య, జె. రమణా దేవి, ఆర్. పద్మ, ఎం. మురళి కుమార్, ఎన్. శోభా వాలెంటీనా, ఎం. ఉమాపతి, సిహెచ్ రామచంద్ర రావు, కే. సంపత్ కుమార్, ఎస్. రమణ, జనరల్ మేనేజర్లు చక్రపాణి, జగదీష్, లత, తదితరులు పాల్గొన్నారు.
















