హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. తీవ్రంగా మందలించింది. ఏం తమాషాగా ఉందా అంటూ ఫైర్ అయ్యింది. విద్యా రంగ పరంగా నెలకొన్న సమస్యలకు సంబంధించి పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి హైకోర్టులో. ఇదిలా ఉండగా కోర్టుకు హాజరు కాకపోవడంపై విద్యాశాఖ కార్యదర్శిని తీవ్రంగా మందలించింది. కోర్టు ధిక్కార కేసులో నోటీసులు అందినప్పటికీ డాక్టర్ యోగితా రాణా కోర్టుకు హాజరు కాక పోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ టి. మాధవీ దేవి ఆ అధికారిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. “కోర్టుల పట్ల మీరు చూపే గౌరవం ఇదేనా?” అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రవర్తనను సహించేది లేదని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటివి జరిగితే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు.
తన ‘కంప్యాషనేట్ అపాయింట్మెంట్’ (కుటుంబ సభ్యుల మరణం తర్వాత లభించే ఉద్యోగం)కు సంబంధించి 2023లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని ఆరోపిస్తూ హైదరాబాద్కు చెందిన సయ్యద్ మెహబూబ్ ఈ కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేశారు. యోగితా రాణా స్వయంగా హాజరు కాకపోవడం లేదా హాజరు నుండి మినహాయింపు కోరక పోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ రోజు మధ్యాహ్నానికల్లా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆమెను ఆదేశించారు. అనంతరం, నిజామాబాద్ నుండి వర్చువల్ విధానంలో హాజరైన యోగితా రాణా, సమాచార లోపం వల్లే తాను హాజరు కాలేక పోయానని పేర్కొంటూ బేషరతుగా క్షమాపణలు కోరారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆమె కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, వివిధ శాఖల మధ్య అధికారులు బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ ఉండటం వల్ల పిటిషనర్ జీవితం ప్రభావిత మవుతోందని జస్టిస్ మాధవీ దేవి వ్యాఖ్యానించారు. తమ మునుపటి ఆదేశాలను అమలు చేయాలని, కోర్టు ధిక్కార పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

















