చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. తను ఎన్నికల సందర్బంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు ఇకపై 1 గ్రాము బంగారు ఉంగరం ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకూ ‘తైమామన్’ (మేనమామ) హోదాలో బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తానని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఈ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు, పర్యవేక్షణ , నిర్వహణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక పరిపాలనా విభాగం (స్టేట్ ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్)ను ఏర్పాటు చేయనుంది.
కుటుంబంలోకి కొత్తగా వచ్చిన బిడ్డకు స్వాగతం పలికే ‘తైమామన్ సీర్’ (మేనమామ ఇచ్చే కానుక) అనే సాంస్కృతిక సంప్రదాయానికి అనుగుణంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి శిశువుకూ ఈ బంగారు ఉంగరాన్ని అందిస్తారు. దీని ప్రస్తుత విలువ రూ. 13,600. “ఈ పథకం ద్వారా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకూ ప్రభుత్వం ‘మామన్’ (మేనమామ) పాత్రను పోషిస్తూ, స్వాగత చిహ్నంగా శాశ్వతంగా నిలిచిపోయే బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తుంది” అని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఇచ్చే ఈ 1 గ్రాము బంగారు ఉంగరం, బిడ్డ జననాన్ని గుర్తుచేసే ఒక జ్ఞాపికగా ‘తైమామన్ తంగ మోతిరం తిట్టం’ (మేనమామ బంగారు ఉంగర పథకం) ద్వారా మాతృత్వపు ఆనందాన్ని, ప్రాముఖ్యతను చాటేలా అభినందన చిహ్నంగా ఉంటుంది అని జూన్ 23న విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వు (GO) తెలిపింది
















