అమరావతి : వర్జీనియా పొగాకు రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. అంతర్జాతీయ మార్కెట్లలో వర్జినీయా పొగాకు ఉత్పత్తి పెరగడం, ఎగుమతి పరిస్థితులు మారడం వల్ల ధరలు ప్రభావితమైనప్పటికీ రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. పొగాకు వేలం కేంద్రాల్లో అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. పొగాకు బోర్డు పరిధిలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిస్థాయిలో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రైతులు తీసుకొచ్చిన పొగాకును తిరస్కరించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి.
మార్కెట్‌లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం ఆదేశించారని చెప్పారు. ఎవరు కొనుగోలు చేయక పోయినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పంటలు నష్ట పోకుండా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే బీమా సదుపాయం కూడా అమలు చేస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. ,పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. వేలం కేంద్రాల వెలుపల జరిగే అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా భవిష్యత్తులో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగు విస్తీర్ణంపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు అందించే చర్యలు చేపడతామని తెలిపారు.


















