న్యూఢిల్లీ : ప్రధాని మోదీ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో భేటీ అయ్యారు. ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించాయి ఇరు దేశాలు. భారత్-వెనిజులా సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై నేతలు చర్చించినట్లు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జాతీయ రాజధానిలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. అంతకు ముందు రోజు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రోడ్రిగ్జ్‌తో భేటీ అయ్యారు. ఆ దక్షిణ అమెరికా దేశంతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ఈరోజు న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను కలవడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు . భారత్-వెనిజులా సంబంధాల పట్ల ఆమెకున్న దీర్ఘకాలిక నిబద్ధతను ప్రశంసించారు. ప్రధాని మోదీతో రోడ్రిగ్జ్ సమావేశం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. భారత్, వెనిజులా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఐదు రోజుల కార్య పర్యటన నిమిత్తం రోడ్రిగ్జ్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. వెనిజులా నాయకురాలికి స్వాగతం పలుకుతూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటన ఇరు దేశాలకు సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి , వారి ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుందని పేర్కొంది.















