అమరావతి : ఇండియన్ రాక్ స్టార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటి వరకు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరు పొందారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన తండ్రి గొప్ప రచయిత. అంతకు మించిన ప్రేమికుడు కూడా. కుటుంబ బాంధవ్యాలంటే విపరీతమైన అభిమానం. ఇదిలా ఉండగా ఈ రాక్ స్టార్ ఇప్పుడు హీరోగా కూడా మారాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన బలగం చిత్రాన్ని తీసిన దర్శకుడు వేణు మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. అదే ఎల్లమ్మ. తెలంగాణ ప్రాంతంలోని దైవత్వానికి, గ్రామీణ ప్రాంత సంస్కృతికి ప్రతీక. ఎల్లమ్మ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా దేవిశ్రీప్రసాద్ ను హీరోగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్బంగా చెన్నైలో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఉన్నట్టుండి తన స్వంత ఊరికి వచ్చాడు. ఈ సందర్బంగగా ఎల్లమ్మ చిత్రంలో హీరోగా నటించడానికి తాను ఎందుకు అంగీకరించారనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన తండ్రి జన్మించిన ‘వేదురుపాక’ గ్రామాన్ని సందర్శించాడు రాక్‌స్టార్. జాతర ఉత్సవాల సందర్భంగా తన పూర్వీకుల నివాసంలో గ్రామస్తులతో కలిసి ముచ్చటించాడు. వేదురుపాక సంస్కృతి, జానపద కళలు, అక్కడి దైవత్వమే తనను ఈ సినిమా వైపు ఆకర్షించాయని వెల్లడించాడు. చెన్నై నుండి తన తండ్రి తనను ఇక్కడికి తీసుకువచ్చి, ఆ పచ్చని ప్రకృతిని ఆస్వాదించేలా చేసే విధానాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు దేవిశ్రీ ప్రసాద్.
స్థానిక ప్రజలతో , తన మూలాలతో అనుబంధాన్ని కొనసాగించడం కోసమే తాను ఆ గ్రామంలో ఒక అందమైన ఇంటిని నిర్మించుకున్నానని తెలిపాడు . ఇక ఎల్లమ్మ సినిమా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.



















