విజయవాడ : రాష్ట్రంలో “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు గానే, “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టుల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అందు కోసం జిల్లాల వారీగా “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు యజమానులు తమ వివరాలు దిగువ పేర్కొన్న మెయిల్ ఐ.డి.కి, లేదా చిరునామాకు పంపాలని కోరారు ఆలపాటి సురేష్ కుమార్.
మెయిల్ ఐ.డి pressacademy.ap@gmail.com కి గానీ లేదా సి.ఆర్. మీడియా అకాడమీ, 40-6/4-8.4 వ అంతస్తు, రెవిన్యూ కాలనీ, మొగల్రాజపురం, విజయవాడ, 520010 అనే చిరునామాకు పంపించాలని సూచించారు. ఇందుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. యూట్యూబ్ ఛానల్ పేరు. యజమాని పేరు, సబ్ స్క్రైబర్స్ సంఖ్య, చిరునామా, ఫోన్ నెంబర్స్ , వాట్సాప్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ విధిగా తెలియ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మీడియా అకాడెమీ ఆధ్వర్యంలో విస్తృతంగా శిక్షణా , అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా తాను చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి దాకా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆలపాటి సురేష్ కుమార్. ఆయన స్వతహాగా జర్నలిస్టుగా పని చేశారు. వివిధ మాధ్యమాలలో తనదైన ముద్ర కనబర్చారు. ఆ తర్వాత స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. దీంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏరికోరి ఆయనకు మీడియా అకాడెమీ బాధ్యతలు అప్పగించారు.
















