అమరావతి : గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా నేతన్నల కష్టాలను తెలుసుకుని, ఉచిత విద్యుత్ అందజేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు మంత్రి ఎస్. సవిత. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏడాదికి రూ.150 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం వెచ్చిస్తోందని వెల్లడించారు. సుమారు 1.04 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ది కలుగనుందని తెలిపారు. పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతోందని అన్నారు ఎస్ సవిత.
నేటితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలో 5 జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కలంకారి చీరలు, పెన్ కలంకారి చీరలు, దుపట్టాలు, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, క్రోచెట్ లేస్ చీరల తయారీలో శిక్షణ అందజేశామన్నారు. ఆప్కో షో రూముల్లో రెడీమేడ్ చేనేత వస్త్రాలను అమ్మకాలు ప్రారంభించినట్లు చెప్పారు. వెల్క్రో ధోవతులు, కాటన్ రెడీమేడ్ పెళ్లికూతురి ధోవతులు, మోడీ జాకెట్లు, సిల్క్ పెళ్లికూతురి సెట్లు, కొత్త డిజైన్లతో రెడీమేడ్ షర్టులు, లెనిన్ షర్టుల సహా వందకు పైగా డిజైన్లతో చేనేత రెడీమేడ్ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నారని చెప్పారు ఎస్. సవిత. మారిన అభిరుచుల నేపథ్యంలో యువత, మహిళలు చేనేత వస్త్రాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారని తెలిపారు.
ఆన్ లైన్ లోనూ చేనేత రెడీమేడ్ దుస్తులు,ఇతర వస్త్రాలను విక్రయిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షో రూమ్స్ ద్వారా 6,770 ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టామన్నారు. ఈ కామర్స్ అమ్మకాలతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే వస్త్రాలను డోర్ డెలివరీ చేస్తున్నారని తెలిపారు. ఆప్కో పేరిట సొంత వెబ్ సైటును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చేనేత వస్త్రాల పై సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తూ, నేటి తరానికి నేతన్నలను కూటమి ప్రభుత్వం మరింత దగ్గర చేస్తోందని అన్నారు ఎస్. సవిత.

















