లక్నో : లక్నో వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. చివరకు టోర్నీ నుంచి నిష్క్రమిస్తూ పరువు పోకుండా కాపాడుకుంది. స్కిప్పర్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆ జట్టుకు కలిసి వచ్చేలా చేసింది. అంతే కాదు లక్నో బౌలర్ల దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే వికెట్లను కోల్పోయి నానా తంటాలు పడింది. 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో యంగ్ క్రికెటర్ కార్తీక్ శర్మ చెన్నైని ఆదుకున్నాడు. తను 71 రన్స్ చేశాడు. ఇక శివమ్ దూబే ఆఖరులో విరుచుకు పడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు దంచి కొట్టడం స్టార్ట్ చేశాడు.
ముఖ్యంగా మిచెల్ మార్ష్ పూనకం వచ్చిన వాడిలా శివాలెత్తి పోయాడు. తను ఇంగ్లీష్ తో కలిసి చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఫోర్లు , సిక్సర్లతో దాడి చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక చేష్టలుడిగి పోయారు చెన్నై ఆటగాళ్లు. ఇక శాంసన్ ఈసారి నిరాశ పరిచాడు. మార్ష్ దెబ్బకు సీఎస్కే ఠారెత్తి పోయింది. 16. 4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది లక్నో సూపర్ జెయింట్స్. మార్ష్ మైదానంలోకి వచ్చిన తొలి ఓవర్ నుంచే దంచడం మొదలు పెట్టాడు. అన్షుల్ వేసిన ఐదో ఓవర్ లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్ తో 28 రన్స్ పిండుకున్నాడు. స్పెన్షర్ జాన్సన్ 6వ ఓవర్ లో 2 బౌండరీలు, సిక్స్ కొట్టాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 90 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.



















