ఢిల్లీ : కేరళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పదవి కోసం అభ్యర్థిని ఖరారు చేసింది ఏఐసీసీ హైకమాండ్. ఈ మేరకు గురువారం పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు కేసీ వేణుగోపాల్ ను కాకుండా వీడీ సతీషన్ ను ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ ఎవరు పదవిని అధీష్టిస్తారనే దానిపై ఉత్కంఠకు ఇవాల్టితో తెర పడింది. ఇక వీడీ సతీశన్ కు మంచి పేరుంది కేరళ రాష్ట్రంలో. ఆయన సారథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ కూటమి పవర్ లోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా ఉన్న సీపీఎం కూటమి ఓటమి పాలైంది. వీడీ సతీశన్ ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా (Leader of Opposition) పనిచేస్తున్నారు. ఆయన 1964లో కేరళలో పుట్టారు. పరవూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వీడీ సతీశన్ కు మంచి వక్తగా పేరు ఉంది. అవినీతి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడిగా గుర్తింపు పొందారు. యువత, మధ్యతరగతి సమస్యలపై చురుకుగా స్పందిస్తూ వచ్చారు. రాజకీయ పరంగా చూస్తే విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు . పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2021లో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. గతంలో పినరయ్ విజయన్ పాలనా కాలంలో తీసుకున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక న్యాయం, పారదర్శకతపై మాట్లాడుతూ వచ్చారు. అసెంబ్లీలో బలమైన చర్చలు చేస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి పవర్ లోకి వచ్చింది. చివరి నిమిషం వరకు వీడీ సతీశన్ తో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ పడ్డారు. కానీ కేసీవీకి షాక్ ఇస్తూ పార్టీ అనూహ్యంగా సతీషన్ వైపు మొగ్గు చూపింది.

















