అమరావతి : ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల రాష్ట్రంలోని వేలాది ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందిస్తూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
మంత్రి ఆదేశాల నేపథ్యంలో ష్రిమ్ప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పందించారు. పెంచిన ఫీడ్ ధరల అమలును తక్షణమే నిలిపివే స్తున్నట్లు ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతున్న కారణంగా ఫీడ్ ధరల సవరణపై ఆలోచించాల్సి వచ్చిందని అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, మంత్రి అచ్చెన్నాయుడు సూచనలు, మార్గదర్శకాలను గౌరవిస్తూ ధరల పెంపును వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులు పాల్గొనే ఉమ్మడి సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అందరి అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని రైతులకు నష్టం కలగకుండా, పరిశ్రమ కూడా కొనసాగగలిగే విధంగా పరస్పర ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.














