అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసిందన్నారు. విద్యార్థులతో సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, మస్కిటో మెష్‌లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సీఎస్‌ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్, ప్రభుత్వ నిధులతో హాస్టళ్లలో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. కొత్తగా 1500 మరుగుదొడ్ల నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం కోసం కుక్ లు, కాపీలు నియమించామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్యం మెరుగు కోసం త్వరలో 1291 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నామని తెలిపారు.
విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనున్నామని పేర్కొన్నారు సవిత. వంట గదుల సామగ్రి కోసం రూ.18 కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు. ఎంజేపీ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఎంజేపీ గురుకులాల్లో రూ.1.50 లక్షలు, బీసీ హాస్టళ్లలో రూ.75 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సంఖ్యను గతంలో 42 నుంచి 109కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని మంత్రి గుర్తు చేశారు. ఆరు ఎంజేపీ గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.


















