అమరావతి : వరి విత్తనాలకు జిల్లాల వారీగా క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు రాయితీ, చిరుధాన్యాలకు 50 శాతం, పప్పుధాన్యాలకు 30 శాతం, శనగలకు 25 శాతం, వేరుశనగ మరియు నువ్వులకు 40 శాతం, పచ్చిరొట్ట ఎరువు విత్తనాలకు 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు 90 శాతం వరకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో 80 శాతం వరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ఖరీఫ్ 2026 సీజన్‌కు మొత్తం 18.09 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయింపు ఉండగా, మే నెల వరకు ఇప్పటికే 3.44 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించబడినట్లు మంత్రి వెల్లడించారు.
ఏప్రిల్ 1 నాటికి 7.13 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉండగా, ఇప్పటివరకు మరో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రానికి చేరాయని తెలిపారు. దీంతో మొత్తం 8.84 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు విక్రయించగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. యూరియా 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 0.35 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3.62 లక్షల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 0.46 లక్షల మెట్రిక్ టన్నుల మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేసి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎరువుల సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాల వారీగా నిల్వలు, సరఫరాపై అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధీకృత ఎరువుల దుకాణాల నుంచే ఎరువులను కొనుగోలు చేయాలని, అధిక ధరలకు కొనవద్దని మంత్రి సూచించారు. రైతులకు అవసరమైన ప్రతి ఎరువు సమయానికి అందేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు.

















