తిరుమల : ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కళాశాల 157వ గవర్నింగ్ బాడీ సమావేశం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. వఝాల రవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల సౌకర్యార్థం ఢిల్లీలో ఆడిటోరియం, అదనపు బ్లాకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తరగతి గదుల్లో ఏసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, టీటీడీ ఉద్యోగుల తరహాలో ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి లడ్డూ కార్డులు, శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఆమోదం తెలిపారు. విద్యార్థులను పరిశోధనలు, ఆర్టికల్స్, పబ్లికేషన్స్ వైపు ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వఝాల రవి కళాశాల అభివృద్ధి, విద్యా కార్యక్రమాలపై సమగ్ర నివేదికను చైర్మన్, ఈవోలకు నివేదించారు.
ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారంటే వల్లమాలిన అభిమానం. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అనుబంధ ఆలయాలలో తప్పనిసరిగా , విధిగా భక్తులకు ఇబ్బంది లేకుండా నిత్యం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు టీటీడీ చర్యలు చేపట్టే పనిలో పడింది.



















